
అనుష్క శెట్టి ప్రధాన పాత్రలో క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో తెరకెక్కిన ‘ఘాటి’ చిత్రం సెప్టెంబర్ 5న విడుదలకు సిద్ధంగా ఉంది. అయితే, ఈ సినిమా ట్రైలర్‌లో గంజాయి సాగు, రవాణా, వినియోగంపై కేంద్రీకృతమైన సన్నివేశాలు ఉన్నాయని, వీటిపై చట్టబద్ధమైన హెచ్చరికలు లేనందున తెలంగాణ ఈగల్ టీమ్ (ఎలైట్ యాక్షన్ గ్రూప్ ఫర్ డ్రగ్ లా ఎన్‌ఫోర్స్‌మెంట్) తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. ఈ సన్నివేశాలు యువత, విద్యార్థులపై ప్రతికూల ప్రభావం చూపుతాయని, గంజాయి వాడకాన్ని ప్రోత్సహించేలా ఉన్నాయని ఈగల్ టీమ్ ఆందోళన వ్యక్తం చేసింది.
ఈగల్ డైరెక్టర్ సందీప్ శాండిల్య గురువారం ఒక ప్రకటన విడుదల చేస్తూ, గంజాయి సంబంధిత సన్నివేశాలను తొలగించాలని చిత్ర బృందాన్ని డిమాండ్ చేశారు. ఒకవేళ ఈ సన్నివేశాలను తొలగించకపోతే, 1985 NDPS చట్టం కింద చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఇప్పటికే రాష్ట్రంలో గంజాయి అమ్మకాలు, వినియోగంపై కఠిన చర్యలు తీసుకుంటున్న నేపథ్యంలో, ఈ సన్నివేశాలు సమాజానికి తప్పుడు సందేశం ఇస్తాయని ఈగల్ టీమ్ పేర్కొంది. ఈ విషయంపై చిత్ర యూనిట్ ఎలా స్పందిస్తుందనేది ఆసక్తికరంగా మారింది.


