
దిగ్గజ సంగీత దర్శకుడు, ప్రపంచ స్థాయి గుర్తింపు దక్కించుకున్న గాయకుడు ఘంటసాల వెంకటేశ్వరరావు (ఘంటసాల) జీవిత చరిత్ర ఆధారంగా ‘ఘంటసాల ది గ్రేట్’ అనే సినిమాను సి.హెచ్. రామారావు తెరకెక్కించారు. అన్యుక్త్ రామ్ పిక్చర్స్ బ్యానర్ మీద ఓ మంచి పాట లాంటి సినిమాను శ్రీమతి సి.హెచ్. ఫణి నిర్మించారు. ఈ చిత్రంలో ఘంటసాల వారి పాత్రను సింగర్ కృష్ణ చైతన్య పోషించారు. ఈ మూవీని జనవరి 2న ఘనంగా రిలీజ్ చేశారు. మరి ఈ మూవీ ఎలా ఉంది? కథ ఏంటి? అన్నది ఓ సారి చూద్దాం.
కథ :
ఘంటసాల వెంకటేశ్వరరావు (ఘంటసాల) గాన గంధర్వుడు. ఆ విషయం ఆయన పాడిన పాటల్ని వింటేనే అర్థం అవుతోంది. ఎన్నో వేల పాటల్ని పాడిన ఆయన తొలినాళ్లలో ఎన్నో కష్టాల్ని ఎదుర్కొన్నారు. బాల్యంలోనే తండ్రిని కోల్పోవడం, సంగీతంలో శిక్షణ తీసుకునేందుకు కష్టాలు పడటం, పూట గడవడం కోసం బిక్షాటన చేయడం వంటివెన్నో ఆయన జీవితంలో ఉన్నాయి. రోడ్డు మీద భిక్షాటన చేసే స్థాయి నుంచి ప్రపంచ స్థాయి వేదికలపై కచేరీలో చేసే స్థాయికి వెళ్లిన ఘంటసాల వారి జీవితంలోని ప్రధాన ఘటనల్ని ఎలా చూపించారు? ఆయనకు బడే గులాం అలీ ఖాన్‌కి ఉన్న బంధం ఏంటి? క్విట్ ఇండియా ఉద్యమం, పొట్టి శ్రీరాములుతో ఉన్న పరిచయం, చివరి క్షణాల్లో ఆయన గాత్రం మూగబోవడం, చివరి కోరిక తీరకుండానే చనిపోవడం వంటి ఘటనల్ని తెలుసుకోవాలంటే థియేటర్‌కు వెళ్లాల్సిందే.
నటీనటుల నటన :
బాల నటుడు అతులిత్ ఘంటసాల వారి బాల్యానికి సంబంధించిన సీన్లలో అద్భుతమైన నటనను ప్రదర్శించాడు. చాలా చోట్ల కన్నీరు పెట్టించేలా అభినయాన్ని ప్రదర్శించాడు. ఘంటసాల వారి యవ్వన, అవసాన దశను నటుడు కృష్ణ చైతన్య కళ్లకు కట్టినట్టుగా చూపించాడు. ఆయన నడక, హావభావాలు ఇలా అన్నీ అద్భుతంగా అనిపిస్తాయి. ఘంటసాల సతీమణి పార్వతమ్మగా మృదుల చక్కటి అభినయాన్ని ప్రదర్శించారు. ఓ కీలక పాత్రలో బడే గులాం అలీ ఖాన్‌గా సుమన్ తన పరిధి మేరకు నటించి మెప్పించారు. ఘంటసాల వారి గురువు పట్రాయని సితారామ శాస్త్రిగా సుబ్బరాయ శర్మ, సముద్రాల రాఘవాచారిగా జె.కె. భారవి, ఇంద్రుడి పాత్రలో సాయి కిరణ్, ఘంటసాల తల్లిగా జయ వాణి ఇలా అందరి పాత్రలు బాగుంటాయి.
విశ్లేషణ :
ఘంటసాల గారి జీవిత చరిత్రను తెరకెక్కించాలనే దర్శకుడు సి.హెచ్. రామారావు సంకల్పం గొప్పది. ఆయన వ్యక్తిగత కష్టాలు, గొప్ప మనసును ప్రేక్షకులకు తెలియజేయడం లక్ష్యంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ఈ ప్రయాణంలో ఆయన తన లక్ష్యాన్ని అయితే చేరుకున్నట్టుగానే అనిపిస్తుంది. కానీ ఓ పూర్తి స్థాయి సినిమాగా, కమర్షియల్‌గా చూసుకుంటే ఘంటసాల అందరినీ అంతగా మెప్పించకపోవచ్చు.
ఘంటసాల వారి కష్టాలు, ఆర్థిక ఇబ్బందులు ప్రధానాంశంగా ప్రథమార్దాన్ని చూపించారు. పొట్టకూటి కోసం పడిన బాధలు, సంగీతం నేర్చుకునే క్రమంలో అవమానాలు చూపించారు. ఘంటసాలను వేధించే పీడకల ప్రవేశంతో ఉత్కంఠభరితమైన ఇంటర్వెల్‌ను డిజైన్ చేశారు. ఆ తరువాత ద్వితీయార్దంలో ఘంటసాల వారి వైభవం, ప్రఖ్యాతిని చూపించాడు. లతా మంగేష్కర్, మహ్మద్ రఫీ వంటి దిగ్గజాల ప్రశంసల సీన్లు ఆకర్షణీయంగా ఉంటాయి. బడే గులాం అలీ ఖాన్‌తో ఉన్న ఆత్మీయ అనుబంధాన్ని చక్కగా వివరించారు.
ఆయన గాత్రం మూగబోవడం, చివరి కోరిక తీరకుండా మరణించడం వంటి సన్నివేశాలు హృదయాన్ని కదిలిస్తాయి. సినిమాకు బలం సంగీతం. చాలా వరకు ఘంటసాల గారి అసలు పాటలనే వాడారు. ఘంటసాల థీమ్ మ్యూజిక్, నేపథ్య సంగీతం ఆ కాలంలోకి తీసుకెళ్తాయి. కెమెరా వర్క్ పాత కాలాన్ని ప్రతిబింబిస్తుంది. వీఎఫ్‌ఎక్స్, గ్రాఫిక్స్ మరియు ఆర్ట్ వర్క్ నాణ్యత కొంత తేలిపోయినట్లుగా కనిపిస్తుంది. సాంకేతికంగా అద్భుతం కాకపోయినా, తెలుగు వారంతా తప్పక చూడాల్సిన, తెలుసుకోవాల్సిన చారిత్రక చిత్రంగా నిలుస్తుంది.
సారాంశం : ఘంటసాల జీవిత చరిత్ర తెలుసుకోవడమే ఒక గొప్ప అదృష్టం. అటువంటి వ్యక్తి జీవితం కళ్ళకు కట్టినట్లు చూపించిన ఘంటసాల చిత్రాన్ని తప్పక చూడాలి.


